సెల్బంధ విమోచన వ్రతం
కావల్సిన పదార్థాలు : ఖరీదైన ఆండ్రాయిడ్ సెల్, ఇంటర్నెట్ ప్లాన్
ఆచరించ దగిన రోజులు : 365 రోజులలో ఏ రోజైనా సరే
ఆచరించదగిన వారు : మొబైల్ బాధితులు ఆడా, మగ ఎవరైనా చేయవచ్చు.
వ్రత ఆచారం : ఉదయమునే స్నానాధికములు ముగించుకొని ఖరీదైన ఆండ్రాయిడ్ సెల్‌ఫోన్‌ని తీసుకొని ఒక బంగారు లేదా వెండి లేదా ఇత్తడి అథమం మట్టి పళ్లెమందు ఉంచాలి.
1. సెల్లాయనమః , 2. బిల్లుతో జేబు చిల్లాయనమః
3. ఇల్లు గుల్లాయనమః , 4. కొంప కొల్లేరాయనమః
5. సమయ చోరాయనమః, 6. సంసార ధ్వంసినేనమః..
ఇత్యాది అష్టోత్తర శతనామ మంత్రములతో చక్కగా పూజించి, ఆ సెల్‌ని, సెల్ కొనుక్కోలేని ఒక పేద వానికి, సెల్ నెత్తిన సత్తు రూపాయొకటుంచి, పళ్లెముతో సహా దానమీయవలెను.
వ్రత కథ : పూర్వం ద్వాపరయుగాంతమై కలియుగ ప్రారంభకాలమున మొబైలుష్మతీ రాజ్యమును సెల్భంజనుడు అను రాజు ప్రజానురంజకుడై పాలించుచుండెను. ఆ రాజ్యమందు కలి, తన కలి ప్రభావమును చూపనెంచినవాడై సెల్ఫోనురూపుడై ఉద్భవించెను. తొలుత ఆ సెల్లును జనులు కేవలం సంభాషణకు మాత్రమే ఉపయోగించుచుండిరి. ఇట్లు మాత్రమే ఉపయోగించిన, తన కలి ప్రభావం కనపడకయుండుట గమనించిన కలి పురుషుడు తన దుష్టాంశలైన ఇంటర్నెట్, ఆండ్రాయిడ్‌లను మొబైల్‌నందు ప్రవేశపెట్టి వాని జడలగు యాప్‌లను లెక్కకు మిక్కిలిగా విస్తరింపచేసెను. అట్టి యాప్‌లలో వాట్సప్, ఫేస్‌బుక్‌లాంటి వాటికి వ్యసనపరులై జనులు నిస్తేజస్కులైరి. ఈ సమాజ తిరోగమనమునకు కారణమైన కలినెట్లు నిలువరించవలెనని మిక్కిలి దుఃఖితుడైనాడు. లోక కల్యాణ కాంక్షా తత్పరుడైన నారదమునీంద్రులు ఏతెంచి ఆ రాజు చింతాక్రాంతుడగుటకు కారణమును తెలిసికొనినవాడై సెల్లు కలి నిర్మూలనము దుఃస్సాధ్యమనియు, సెల్లును నిలువరించుటకు ఆచరింపదగు ఏకైక, సెల్బంధ విమోచన వ్రతంగూర్చి నొక్కినొక్కి వక్కాణించెను. ఈ వ్రతమాచరించిన జాతి వికాసమును పొందునని ఆశీర్వదించి మరలిపోయెను.
ఫలశ్రుతి : ఈ కథ విన్నను, చదివిననూ సెల్ వ్యామోహం నుంచి ముక్తి కలిగి బ్రహ్మమును నెరుంగుదురు.
No comments:
Post a Comment