Friday, June 9, 2017

తెలివితక్కువ వాళ్ళు

ఒకానొక రాజ్యంలో, రాజుగారు తన మహామంత్రిని పిలిపించాడు.

రాజు:

 " మన రాజ్యంలో
మహా తెలివైనవారు వున్నట్లే, 
మహా తెలివితక్కువ వాళ్లూ వుంటారు కదా ?"

మంత్రి (సంశయిస్తూనే):

"అవును వుంటారు ప్రభూ!"

రాజు:

 " ఐతే, మన రాజ్యం అంతా గాలించి, అందరిలోకి అతి  తెలివితక్కువ వాళ్లను ఐదుగురిని వెదికి పట్టుకొని, ఇక్కడ సభలో హాజరు పరచండి" అని ఆదేశించాడు.

మంత్రి:

"చిత్తం ప్రభూ" అని సభనుండి నిష్క్రమించాడే కానీ మనసంతా ఎలా అన్న ఆలోచనలతోనే మస్తిష్కమంతా నిండిపోయింది.

ఎవడికైనా కొన్ని పరీక్షలు పెట్టో, ప్రశ్నలు అడిగో
వాడు తెలివయిన వాడో, కాదో తెలుసుకోవచ్చు.
మరి, తెలివితక్కువ వాడినెలా గుర్తించాలి?
ఈ సందిగ్దావస్త నుండి బయటపడటమెలాగో అర్ధం కావటంలేదు మంత్రిగారికి. ఒప్పుకున్నాక తప్పదుగా! రాజాజ్ఞమరి.

ఒక నెల రోజులపాటు రాజ్యమంతా తిరిగి ఇద్దరిని పట్టుకుని సభలో హాజరు పరిచాడు.

రాజు:

 " మహామంత్రీ! మీరు పొరబడినట్లున్నారా లేక లెక్క తప్పారా?
మేము ఐదుగురిని ప్రవేశపెట్టమన్నాము. కానీ తమరు ఇద్దరిని మాత్రమే వెంట తీసుకొనివచ్చారు"?

మంత్రి:

 " మహా ప్రభూ! తమరు నేను చెప్పేది కొంచెం ఆలకించండి"

రాజు:

" సరే! సెలవియ్యండి"

మంత్రి:

" నేను రాజ్యమంతా తిరిగాడుచుండగా...
 ఇతను ఒక ఎడ్లబండి మీద కూర్చొని తలపై ఒక పెద్దమూటను పెట్టుకొని వెళుతూ కనిపించాడు. అలా ఎందుకు అని అడుగగా, తలపైనున్న మూట, బండి మీద పెడితే ఎడ్లకు భారమవుతుంది అని సమాధానమిచ్చాడు. అందుకే అతనిని ఐదవ తెలివితక్కువ వాడిగా తీసుకొచ్చాను".

రాజు:

 " భేష్! తరువాత?"

మంత్రి:

" ఈ రెండో అతను తన ఇంటి పైకప్పు మీద పెరిగిన గడ్డిని తినిపించడానికి, తన  గేదెను ఇంటి పైకప్పు మీదకు లాగుతూ కనిపించాడు.

" కావున ఇతన్ని నాల్గవ తెలివితక్కువ వాడిగా ప్రవేశపెట్టాను".

రాజు:

 " బహు బేషుగ్గా వుంది. తరువాత?"

మంత్రి :

" రాజ్యంలో చాలా సమస్యలుండగా,  వాటినన్నింటినీ ప్రక్కనపెట్టి,  తెలివితక్కువ వాళ్లను వెతకటంలో నెల రోజుల పాటు సమయం వృధాచేసాను.  కాబట్టి నేను మూడవ తెలివితక్కువ వాడిని."

రాజు ( గట్టిగా నవ్వుతూ ) " తరువాత ?

మంత్రి :

" పరిష్కరించాల్సిన సమస్యలుండగా, భాద్యతలన్నీ విస్మరించి, తెలివితక్కువ వాళ్ల కోసం వెదుకులాడుతున్న తమరు రెండో వారు".

అది విన్న సభలొని వారంతా నిశ్చేష్టులై భయభ్రాంతులై  చూస్తుండిపోయారు.
నిశ్శబ్దం ఆవరించింది సభలో.

రాజుగారు తేరుకుని కుతూహలం తో  " మంత్రి గారు సందేహం లేదు. మీరు సెలవిచ్చినదాంట్లో వాస్తవానికి దగ్గరగానూ నిశ్సందేహంగా నిజాయితో కూడిన నిజముంది.
మరి మీరు మెదటి తెలివితక్కువ వారెవరో  తెలియచెప్పండి"

మంత్రి:

చిత్తం మహా ప్రభో!
చెయ్యవలసిన పనులన్నీ మానేసి,
నెట్ ఆన్ చేసుకుని ఈ  మెసెజ్  ని చదువుతున్నవాడే...
"ఆ మొదటివాడు.

No comments:

Post a Comment

Related Posts Plugin for WordPress, Blogger...

Get PDF Version